వైటీడీ బోర్డుకు అసెంబ్లీ ఆమోదం..బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సురేఖ

వైటీడీ బోర్డుకు అసెంబ్లీ ఆమోదం..బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సురేఖ
  •  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు
  • బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు
  • పదవీ కాలం రెండేండ్లుగా నిర్ణయం
  • భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే బోర్డు ఏర్పాటు చేసినట్టు వెల్లడి


హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట టెంపుల్​ డెవలప్​మెంట్ (వైటీడీ) బోర్డు బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బిల్లు ఉద్దేశాలను సభలో వివరించారు. తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

‘‘వైటీడీ బోర్డులో 18 మంది సభ్యులు ఉంటారు. కమిటీ సభ్యుల పదవీ కాలం రెండేండ్లుగా నిర్ణయించాం. బోర్డు చైర్మన్, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవు. టీఏ, డీఏలు మాత్రమే ఉంటాయి. వైటీడీ బోర్డు కూడా విద్యాసంస్థలను, ఆధ్యాత్మిక, వేద పాఠశాలను స్థాపించుకోవచ్చు. వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం ద్వారానే  జరుగుతుంది. ఐఏఎస్ స్థాయి అధికారి ఈవోగా ఉంటారు”అని మంత్రి పేర్కొన్నారు.

ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలన్నీ ట్రస్టు బోర్డు పరిధిలోకి వస్తాయని చెప్పారు. టీటీడీ తరహాలోనే వైటీడీ కూడా భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాదగిరిగుట్టలో రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇంకా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టెంపుల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

యాదగిరిగుట్టకు పూర్వవైభవం 

వైటీడీ బోర్డు ఏర్పాటుతో యాదగిరిగుట్టకు పూర్వవైభవం వస్తుందని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. గుట్ట అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని చెప్పారు. గుట్టపైన పార్కింగ్ సౌకర్యం లేదని.. 3 వేల నుంచి 5 వేల కార్లు పార్కింగ్ చేసేలా సౌకర్యాలు కల్పించాలని కోరారు. భక్తుల కోసం వైద్యశాల ఏర్పాటు చేయాలని సర్కారుకు విన్నవించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ.. వేములవాడ, కొండగట్టు, భద్రాద్రి టెంపుల్స్ కు రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని.. వాటిని ట్రస్టు బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నారు.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో రూ.25 లక్షలు పైచిలుకు ఆదాయం వచ్చే ఆలయాలను టూరిస్ట్ సెంటర్లకు లింకు చేయాలన్నారు. యాదగిరిగుట్టకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో.. భద్రాచలానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. యాద్రాద్రిలో వేద పాఠశాల ఏర్పాటు చేసి వేద పండితులను తయారు చేయాలన్నారు. రాయిగిరి చెరువును సుందరంగా తీర్చిదిద్దాలని, బస్వపురం ప్రాజెక్టు వద్ద బృందావన్ పార్క్ నిర్మించాలని కోరారు.

టీటీడీ తరహాలో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ)ని.. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ (వైజీడీ) గా మార్చాలని ఎమ్మెల్యే రాజ​గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రూ.100 కోట్లు పైబడిన ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వాకిట శ్రీహరి కోరారు. వేములవాడ లో వేద యూనివర్సిటీ ఏర్పాటు  చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి 

యాదగిరిగుట్టలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. గిరిజనుడిని బోర్డులో సభ్యుడిగా పెట్టాలన్నారు. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కోసం దేవాలయానికి వచ్చే డబ్బుల నుంచి ఖర్చు చేయడానికి ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేసే వెసులు బాటు కల్పించాలన్నారు. వేములవాడకు కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

యాదగిరిగుట్ట దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే  కేసీఆర్ కృషికి నిదర్శనమని చెప్పారు. వైటీడీని ప్రవేశపెట్టినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. వైటీడీ బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే పూర్తి కృష్ణశిలతో నిర్మించిన ఏకైక దేవస్థానం యాదగిరి గుట్ట అని పేర్కొన్నారు.